ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి యువతే కాదు.. వృద్ధులు కూడా ఫ్యాన్సే. మోదీని అభిమానించి.. తమ కుమారుడిలా భావించే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి కోవకే చెందుతుంది మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన వందేళ్ల బామ్మ. అయితే మోదీపై అందరికంటే ఈ భామకు ఉన్న ప్రేమ కాస్త భిన్నమనే చెప్పొచ్చు. ఎందుకంటే మోదీపై ప్రేమతో 25 ఎకరాల భూమి రాసిస్తానని ఈ బామ్మ ప్రకటించింది.
అసలు స్టోరీ ఏంటంటే.. రాజ్‌గఢ్ జిల్లా హరిపుర గ్రామానికి చెందిన మంగీబాయి తన్వర్ అనే ఆ వృద్ధురాలికి 14 మంది సంతానం. అయితే మోదీని తన 15వ కుమారుడిలా భావిస్తానని ఆమె చెబుతోంది. ప్రధాని దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని, అలాగే తనకూ ఎన్నో పథకాలు అందిస్తున్నారని తెలిపింది. తనతో పాటు దేశంలోని ఎందరో వృద్ధుల అవసరాలు మోదీ తీరుస్తున్నారని ఆ బామ్మ చెప్పుకొచ్చింది. అందుకే మోదీని తన 15వ కుమారుడిగా భావిస్తూ.. తన 25 ఎకరాల ఆస్తిని ఆయన పేరున రాసి ఇవ్వనున్నట్లు మంగీబాయి స్పష్టం చేసింది.