మరోసారి ఓంబిర్లాకు లోక్‌సభ స్పీకర్ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. కాసేపట్లో ఆయన స్పీకర్ పదవికి నామినేషన్ వేసే అవకాశం ఉంది. ఎన్డీయే తరఫున ఓంబిర్లా స్పీకర్ పదవికి నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఆయన ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. రాజస్థాన్‌లోని కోట నుంచి ఓంబిర్లా మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో తొలిసారిగా లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
మరోవైపు లోక్‌సభ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు ఉంది. ఒకవేళ ఇండియా కూటమి తమ అభ్యర్థిని ప్రకటిస్తే లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరగడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అవుతుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను అధికార పక్షం, ప్రతిపక్షాలు ఏకాభిప్రాయంతో ఎన్నుకుంటున్నాయి. ఈ సారి ఏం జరుగుందనేదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. లోక్ సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవిపై ఏకాభిప్రాయాన్ని కుదుర్చేందుకు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ విపక్షాలతో చర్చలు జరిపారు. జూన్ 26న స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది.