ఒకే దేశం – ఒకే ఎన్నిక’ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది. బుధవారం రోజున కమిటీ అధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్‌తో అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ భోసలే, దిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేంద్ర మీనన్ భేటీ అయ్యారు. ఇవి నాలుగో విడత సంప్రదింపులని కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు భేటీలో పాల్గొన్న వారంతా జమిలి ఎన్నికలపై తమ అభిప్రాయాలను తెలిపారని వెల్లడించింది.
ఏకకాల ఎన్నికల వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలపై అసోచామ్ అధ్యక్షుడు, స్పైస్‌జెట్ విమానయాన సంస్థ ఛైర్మన్ అజయ్ సింగ్‌తో కమిటీ సభ్యులు చర్చించినట్లు కమిటీ తెలిపింది. ఈ ఎన్నికల నిర్వహణతో ఉన్న ఆర్థిక ప్రయోజనాలను అజయ్ సింగ్ వివరించినట్లు సమాచారం. “మేం 46 రాజకీయ పార్టీలను సూచనలు కోరగా.. ఇప్పటివరకు 17 పార్టీలు మాత్రమే స్పందిచాయి. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’కు సంబంధించి ప్రజల నుంచి దాదాపు 21వేల సూచనలు అందగా, 81 శాతం మంది ఏకకాల ఎన్నికలకు మద్దతు తెలిపారు” అని కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది.