ప్రధాని మోదీ పాలనలో ఎవరూ జమ్మూకశ్మీర్‌పై రాయి విసిరే సాహసం చేయరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆ దమ్ము ఎవరికీ లేదని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి మన్నాలాల్ రావత్‌కు మద్దతుగా షా శుక్రవారం రోడ్‌షో నిర్వహించారు. ఆర్టికల్ 370 రద్దుపై విపక్షాల వ్యాఖ్యలపై స్పందించారు. ఆర్టికల్ 370 రద్దు కశ్మీర్‌లో గందరగోళానికి దారి తీస్తుందని గతంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను దుయ్యబట్టారు.
గతంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగిస్తే రక్తపాతం జరుగుతుందని చెప్పేవారని షా అన్నారు. ప్రత్యేక హోదాను రద్దు చేసి ఐదేళ్లయ్యిందని, అలాంటి ఘటనలు ఒక్కటీ చోటుచేసుకోలేదని తెలిపారు. “ఇది మోదీ ప్రభుత్వం ఇక్కడ రక్తపాతం మాట వదిలేయండి కనీసం రాయి విసిరే ధైర్యం ఎవరికీ లేదు’’ అని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.