ఇప్పటికే టమాటా ధరలు, పచ్చిమిర్చి రేట్లు సామాన్యుడికి గుదిబండలా మారాయంటే.. ఇప్పుడు ఉల్లి ధర కూడా ఘాటు పెంచేందుకు రెడీ అవుతోంది. ఈ నెలాఖరు వరకు ఉల్లి ధరలు కూడా పెరగనున్నాయట. ఇక సెప్టెంబర్ నుంచి కిలో ఉల్లి ధర రూ.60-70 వరకు చేరొచ్చని ‘క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్ అండ్ అనలిటిక్స్’ పేర్కొంది. 2020 సంవత్సరం నాటి గరిష్ఠాల దిగువనే ఉల్లి ధరలు కొనసాగుతాయని తెలిపింది.
‘సరఫరా-గిరాకీ అసమతౌల్యం ఆగస్టు చివరి నాటికి ప్రతిబింబించొచ్చు. రబీ ఉల్లి నిల్వ కాలం 1-2 నెలలు తగ్గాయి. ఈ నిల్వలు ఆగస్టు చివరికే తగ్గుముఖం పట్టనున్నాయి. దీంతో సెప్టెంబరు నాటికి సరఫరాలు తగ్గి.. ధరలు పెరగొచ్చ’ని క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్ అండ్ అనలిటిక్స్ విశ్లేషించింది. అయితే అక్టోబరు నుంచి ఖరీఫ్ పంట లభ్యత పెరిగితే, ఉల్లి ధరలు మళ్లీ తగ్గుముఖం పడతాయని తన నివేదికలో తెలిపింది. పండగల సీజను(అక్టోబరు-డిసెంబరు)లో ధరల చలనాలు స్థిరంగా ఉండొచ్చని అంచనా వేసింది.