జాతుల మధ్య వైరంతో అల్లకల్లోలమవుతున్న మణిపుర్ రాష్ట్రానికి ఇవాళ ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’కు చెందిన ఎంపీలు వెళ్లారు. ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఎంపీల బృందం.. అక్కడి క్షేత్రస్థాయి స్థితిగతులను పరిశీలిస్తున్నారు. అలాగే కొద్దికాలంగా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతోన్న మైతేయ్, కుకీ వర్గాలకు చెందిన ప్రజలతో మాట్లాడుతున్నారు. శాంతియుత పరిష్కారం కనుగొనేందుకే తాము ఇక్కడకు వచ్చినట్లు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరీ తెలిపారు.
21 మంది సభ్యులతో కూడిన ఆ బృందం దిల్లీ నుంచి విమానంలో ఇంఫాల్‌కు చేరుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా వారంతా హెలికాప్టర్‌లో చురాచాంద్‌పుర్‌కు వెళ్తారు. ఒకటే హెలికాప్టర్ అందుబాటులో ఉండటంతో రెండు బృందాలుగా ఏర్పడి అక్కడకు చేరుకోనున్నారు. అక్కడి పునరావాస కేంద్రాల్లోని కుకీ వర్గ ప్రజలతో మాట్లాడనున్నారు. అలాగే బిష్ణుపుర్ జిల్లాలోని మైతేయ్‌లున్న పునరావాస కేంద్రానికి రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు.
ఆదివారం వారు మణిపుర్ గవర్నర్ అనుసూయ ఉకియ్‌తో భేటీ కానున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, సాధ్యమైనంత త్వరగా శాంతి పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఆమెతో చర్చించనున్నారు. ఇంతకుముందు గవర్నర్ కూడా చురాచాంద్‌పుర్ పునరావాస కేంద్రాలను సందర్శించారు.