రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సర్కార్‌ను మరోసారి గెలవనీయకూడదనే ఉద్దేశంతో ఏర్పడిన విపక్ష కూటమి ఇండియా ఆ దిశగా చర్యలు వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికి రెండుసార్లు భేటీ అయింది. తాజాగా విపక్ష కూటమి మూడో సమావేశం ఆగస్టు 25, 26 తేదీల్లో ముంబయిలో జరగనుంది. ఈ సమావేశానికి శివసేన (ఉద్ధవ్ వర్గం), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుండగా.. కాంగ్రెస్ మద్దతుగా నిలవనుంది. మొదటి సమావేశం పట్నాలో, రెండోది బెంగళూరులో జరిగిన విషయం తెలిసిందే.
అయితే ముంబయి సమావేశంలో సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా చర్చలు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో.. పార్టీల మధ్య కమ్యూనికేషన్ కోసం కమిటీల కూర్పు, 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం, ఎన్నికలకు ముందు ఉమ్మడి నిరసనలు, ర్యాలీలను సమన్వయం చేయడానికి మరొక ప్యానెల్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు 11 మందితో సమన్వయ కమిటీపై తుది నిర్ణయానికి వచ్చినట్లు కూటమి వర్గాలు వెల్లడించాయి.