దేశ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్న వేళ నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వాన్ని కడిగేసెందుకు విపక్షాలు తమ ప్రశ్నలతో సిద్ధమయ్యాయి. మణిపూర్ అల్లర్లు, ధరల పెరుగుదలనే విపక్షాలు అస్త్రాలుగా మలుచుకొనున్నట్లు సమాచారం. తొలి రోజు నుంచే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.
పార్లమెంట్ సమావేశాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతిపక్షాలు కోరిన ప్రతి అంశంపైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అన్ని పార్టీలతో బీఏసీ సమావేశం జరిగిందని.. ఇందులో మణిపుర్ హింసతో పాటు మరో 31 అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
పార్లమెంట్ సమావేశాల ప్రారంభ రోజే.. మణిపుర్ అంశంపై వాయిదా తీర్మానం ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. వీటితో పాటు ఒడిశా రైలు ప్రమాదం, రాష్ట్రాల్లో వరదలు, నిరుద్యోగం, చైనా సరిహద్దు అంశాలపై చర్చ చేపట్టాలని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కోరాయి.