పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు షెడ్యూల్ కంటే ఒకరోజు ముందుగానే నిరవధికంగా వాయిదా పడ్డాయి. చారిత్రక మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం అనంతరం పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. నారీ శక్తి వందన్ అధినియమ్ బిల్లును ఆమోదించగానే రాజ్యసభను.. సభాపతి జగదీప్ దన్‌ఖడ్ నిరవధికంగా వాయిదా వేశారు.
ఈ చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఈ బిల్లుకు మద్దతుగా 215 మంది ఓటు వేసి ఆమోదం తెలిపారు. అంతకుముందు లోక్‌సభ కూడా నిరవధికంగా వాయిదా పడింది. చంద్రయాన్ 3 విజయంపై తీర్మానం అనంతరం స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు లోక్‌సభ ప్రారంభమైన కాసేపటి తర్వాత మోదీ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడం… దేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో కీలక ఘట్టమని అన్నారు. పార్టీలకు అతీతంగా “నారీ శక్తి వందన్ అధినియమ్” బిల్లుకు ఓటు వేసిన రాజ్యసభ ఎంపీలందరికీ కృతజ్ఞతలు చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత.. పార్లమెంట్ భవనం వెలుపల మహిళా ఎంపీలతో ప్రధాని ఫొటో దిగారు.