ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణపై ఇటీవల సుప్రీంకోర్టు మరోసారి ఫైర్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈరోజు మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. వీరు ఇలా పేపర్లలో క్షమాపణ ప్రకటన ఇవ్వడం రెండు రోజుల్లో ఇది రెండోసారి. సైజు విషయంలో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో క్రితం రోజుతో పోలిస్తే మరింత పెద్ద సైజులో పతంజలి క్షమాపణల ప్రకటనలు ఇచ్చింది.
తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెబుతూ వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని పతంజలి గ్రూప్ మంగళవారం రోజున సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ కంపెనీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ దేశవ్యాప్తంగా 67 పత్రికల్లో ఆ ప్రకటనలు ఇచ్చామని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. గతంలో మీ ఉత్పత్తుల ప్రకటనలో ఉపయోగించిన ఫాంట్ సైజునే క్షమాపణల ప్రకటనలకు వాడారా? అని ప్రశ్నించారు. దీంతో బహిరంగ క్షమాపణలను పెద్ద సైజులో మరోసారి ప్రచురిస్తామని రోహత్గీ విన్నవించారు.