సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. శనివారం రోజున 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలను పంపింది. 58 స్థానాల్లో 889 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మే 25 న జరగనున్న ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎన్నికలకు కావాల్సిన ఈవీఎంలు, ఇతర సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు పంపింది.
ఆరో విడతలో 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ విడతలోనే హరియాణాలోని 10, దిల్లీలోని 7 సీట్లకూ ఎన్నిక జరగనుంది. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి మూడో విడతలో భాగంగా మే 7న పోలింగ్ జరగాల్సి ఉండగా ..కనెక్టివిటీకి సంబంధించిన లాజిస్టికల్, కమ్యూనికేషన్ వంటి అడ్డంకుల తలెత్తాయి. దీంతో మే 25న ఆరో విడతలో ఆ స్థానానికి పోలింగ్ నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకు 428 స్థానాలకు పోలింగ్ ముగిసింది. శనివారం 58 చోట్ల ఎన్నిక జరగనుంది. చివరిదైన ఏడో విడత జూన్ 1న జరగనుండగా జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉండనుంది.