ఫోన్​కాల్ రికార్డింగ్ ప్రైవసీ హక్కు ఉల్లంఘనే : ఛత్తీస్​గఢ్ హైకోర్టు

-

అవతలి వ్యక్తికి తెలియకుండా ఫోన్‌కాల్‌ను రికార్డ్‌ చేయడం ప్రైవసీ హక్కు ఉల్లంఘనే అని ఛత్తీస్​గఢ్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఇది రాజ్యాంగంలోని అధికరణం 21 గోప్యత హక్కు ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపింది. 2019 నుంచి పెండింగులో ఉన్న నిర్వహణ ఖర్చుల కేసుకు సంబంధించి తన భర్త (44) పిటిషన్‌ను అనుమతిస్తూ ఓ మహిళ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో భార్య అనుమతి లేకుండా భర్త ఆమె ఫోను సంభాషణలను రికార్డు చేసిన విషయం హైకోర్టు దృష్టికి వచ్చింది.

ఛత్తీస్‌గఢ్‌ మహాసముంద్‌ జిల్లాకు చెందిన ఈ కేసులో తన భర్త నుంచి నిర్వహణ ఖర్చులు ఇప్పించాల్సిందిగా మహిళ మొదట కుటుంబ న్యాయస్థానానికి వెళ్లగా.. ఫోనులో తాను రికార్డు చేసిన ఆమె సంభాషణల ఆధారంగా తన భార్యను మరోమారు విచారించాలని భర్త ఫ్యామిలీ కోర్టులో పిటిషన్​ వేశారు. ఫోన్ రికార్డింగ్ ద్వారా ఆమెకు ఇతరులతోనూ సంబంధాలు ఉన్నాయన్న విషయం రుజువైతే.. విడాకుల తర్వాత తాను మెయింటెనెన్సు ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నది అతడి ఉద్దేశం.

భర్త వినతిని స్వీకరించిన ఫ్యామిలీ కోర్టు తీర్పును భార్య హైకోర్టులో సవాలు చేయగా.. మహిళ గోప్యత హక్కుకు భంగకరమైన ఫోన్‌ రికార్డింగ్​ ఆధారంగా భర్త పిటిషన్‌ను అనుమతించారని.. తద్వారా ఫ్యామిలీ కోర్టు చట్టపరమైన తప్పిదం చేసిందని హైకోర్టులో బాధితురాలి న్యాయవాది వాదించారు. ఇరు పక్షాల వాదనల తర్వాత ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ రాకేశ్‌ మోహన్‌ పాండే తోసిపుచ్చుతూ.. ఆ ఆదేశాలను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version