కేరళలోని వయనాడ్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి 19మంది మృతి చెందారు. మెప్పాడి ముండకైలో ప్రాంతంలో అర్ధరాత్రి ఒంటిగంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు రెండుసార్లు కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులున్నారు. ఇంకా వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారి కోసం ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించింది. అత్యవసర సహాయం కోసం 9656938689, 8086010833 నంబర్లను సంప్రదించాలని సూచించింది.
మరోవైపు ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం చేస్తామని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఇస్తామని తెలిపారు. ఈ ఘటనపై కేరళ స్పందించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంబంధిత ప్రభుత్వ సంస్థలు, పాలన యంత్రాంగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు.