శాసనసభ సమావేశాలు తిరిగి ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి సమావేశాల్లోనూ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. సభ ప్రారంభం కాగానే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం మరో 19 పద్దులపై శాసనసభలో చర్చ మొదలు పెట్టారు. ఈ క్రమంలో సభాపతి మాట్లాడుతూ.. ఇవాళ తెల్లవారుజాము 3.15 గంటల వరకు సభ జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా నిన్నటిలా సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సబ్జెక్ట్‌పైనే మాట్లాడాలని సభ్యులందరికీ సూచించారు.
అనంతరం మరో 19 పద్దులపై శాసనసభలో చర్చ మొదలైంది. ఇవాళ్టి సమావేశాల్లో వ్యవసాయం, సహకార, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, గృహనిర్మాణం, పౌరసరఫరాలు, పశుసంవర్ధక, పర్యాటక, క్రీడాశాఖలు, అటవీ, దేవదాయ, మైనార్టీ, చేనేత, స్త్రీ శిశు సంక్షేమశాఖ పద్దులపై చర్చ జరుగుతోంది. వీటన్నింటిపై చర్చ జరిగిన తర్వాత ఇవాళ మంత్రులు చర్చకు సమాధానం ఇస్తారు. అయితే ఒకేరోజు 19 పద్దులపై చర్చ పెట్టడం సరికాదని కేటీఆర్ అన్నారు.