పార్లమెంటులో అలజడి అంశంపై ఉభయసభల్లో వాయిదాలపర్వం కొనసాగుతోంది. ఉదయం 11గంటలకు లోక్‌సభ సమావేశం కాగానే స్పీకర్ ఓంబిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టగా భద్రతా వైఫల్యంపై హోంమంత్రి ప్రకటన చేయాలంటూ విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించటంతో స్పీకర్ ఓంబిర్లా సభను తొలుత 12గంటల వరకు, ఆ తర్వాత 12.30 గంటల వరకు వాయిదావేశారు. అటు రాజ్యసభలో ఇదే పరిస్థితి కొనసాగింది.
ఈ నేపథ్యంలో పార్లమెంటులో ఆందోళనకు దిగుతున్న విపక్షాల తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రవర్తన కారణంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలు మరిన్ని సీట్లు కోల్పోతాయని అన్నారు. బీజేపీ మరిన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్లమెంటు భద్రతా లోపం విషయంలో ప్రభుత్వ వైఖరిని మోదీ సమర్థించుకున్నారు. ఇవాళ పార్లమెంటు సమావేశాలకు ముందు జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ‌్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను విశ్వసించేవారు కచ్చితంగా అలజడి ఘటనను ఖండించాలని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.