జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రచార సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం జమ్మూ కాశ్మీర్ లోని సంఘల్దాన్ లో ప్రచార సభలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని మోదీ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాని మోదీ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారని అన్నారు.
జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. కేంద్ర పాలిత ప్రాంతాన్ని తొలుత రాష్ట్రంగా చేసి, ఒక రాష్ట్రాన్ని రద్దు చేసి ప్రజల హక్కులను కాలరాశారన్నారు. 1947లో తాము రాజులను రద్దుచేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని.. దేశానికి తాము రాజ్యాంగాన్ని ప్రసాదించామని పేర్కొన్నారు.
కానీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో లెఫ్టినెంట్ గవర్నర్ పేరుతో ఓ రాజు పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చేందుకు ఆర్టికల్ 370 ని రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను కాజేశారని ఆరోపించారు. మోడీ సర్కార్ కూలిపోయే సమయం ఇంకేంతో దూరం లేదని దుయ్యబట్టారు రాహుల్ గాంధీ.