ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తోందని.. 2029 యూత్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుంచి తమకు కచ్చితంగా మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణకు వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని భారత్ వదులుకోదని మోదీ స్పష్టం చేశారు.
మహారాష్ట్ర ముంబయిలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్లో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్లో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహణ.. 140 కోట్ల మంది భారతీయుల కల అని అభివర్ణించారు. ప్రపంచ స్పోర్ట్స్ టోర్నమెంట్లను నిర్వహించే సామర్థ్యాన్ని భారత్ ప్రదర్శించిందని తెలిపారు.
“సింధు లోయ నాగరికత నుంచి వేదాల యుగం వరకు.. మన దేశంలో క్రీడల వారసత్వం సుసంపన్నంగా ఉంది. ‘ఒకే భూమి- ఒకే కుటుంబం- ఒక భవిష్యత్తు’ అనే భావనను క్రీడలు బలపరుస్తున్నాయి. దేశంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు బీజేపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. భారత్‌లో 40 ఏళ్ల తర్వాత ఐఓసీ సెషన్ జరగడం.. అది కూడా ముంబయిలో జరగడం దేశానికి గర్వకారణం” అని మోదీ అన్నారు.