గత 24 ఏళ్లుగా తనపై వస్తోన్న దుర్భాషలు వింటూనే ఉన్నానని.. ఆ గాలి మాటలను తాను పట్టించుకోవడం మానేశానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తమను అణచివేసేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ వస్తోన్న విమర్శలపై మోదీ స్పందిస్తూ..పదేళ్లపాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కేవలం రూ.34 లక్షలనే స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. కానీ గత 10 ఏళ్ల కాలంలో రూ.2,200కోట్లను ఈడీ సీజ్ చేసిందని వెల్లడించారు.
దేశానికి అన్నికోట్ల రూపాయాలను వెనక్కి తెచ్చిన వ్యక్తిని గౌరవించాలి కానీ.. నిందించకూడదని మోదీ వ్యాఖ్యానించారు. ఆ డబ్బును దొంగతనం చేసిన వ్యక్తి పట్టుబడిన తర్వాత అరుస్తుంటాడని.. తమ ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం ఉపేక్షించదని స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటివరకు 101 సార్లు విపక్షాలు తనను దుర్భాషలాడాయని పార్లమెంట్ సభ్యుడొకరు లెక్కించి చెప్పారని మోదీ తెలిపారు. ఎన్నికలు ఉన్నా, లేకపోయినా ఆ ప్రతిపక్ష నేతల ప్రవర్తన అలాగే ఉంటుందని దుయ్యబట్టారు.