లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లతో ఘనవిజయం సాధిస్తామని బీజేపీ ధీమాతో ఉంది. రానున్న ఎన్నికల అనంతరం కేంద్రంలో తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం కోసం మొదటి 100 రోజులకు, వచ్చే ఐదేళ్ల పాలన కోసం రోడ్ మ్యాప్‌ను సిద్ధంచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ మంత్రులను ఆదేశించినట్లు సమాచారం.
ఆదివారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ రోడ్‌మ్యాప్ రూపొందించడంలో సంబంధిత మంత్రిత్వశాఖ కార్యదర్శులు, అధికారుల సలహాలను తీసుకోవాలని మోదీ సూచించినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిన మరుసటి రోజే ఈ సమావేశాన్ని ప్రధాని నేతృత్వంలో నిర్వహించినట్లు తెలుస్తోంది. మార్చి 3వ తేదీన ప్రధాని నేతృత్వంలోని మంత్రిమండలి వికసిత్ భారత్-2047 లక్ష్యంపై జరిపిన మేధోమథనంలోనూ ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే ఈ సార్వత్రిక మహాసంగ్రామానికి తాము సర్వసన్నద్ధంగా ఉన్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రస్తుతం విపక్షాల పరిస్థితి చుక్కాని లేని నావలాగ ఉందంటూ ఎద్దేవా చేశారు.