ప్రధాని నరేంద్ర మోదీ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేశారు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ప్రధాని ఆరా తీశారు. పవన్ తో మాట్లాడి మార్క్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న మోదీ.. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ధైర్యంగా ఉండాలని పవన్ కు చెప్పిన అన్ని రకాలుగా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. సింగ్‌పూర్‌లో పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడికి గాయాలైన విషయం తెలిసిందే.
మంగళవారం ఉదయం సింగపూర్ లో మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పదేళ్ల బాలిక మృతి చెందగా.. పది మందికిపైగా చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కూడా ఉన్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం ఇక్కడి ప్రభుత్వ కార్యక్రమం ముగియగానే సింగపూర్ కు బయల్దేరారు. మరోవైపు పవన్ సోదరుడు చిరంజీవి మార్క్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయన తన సతీమణి సురేఖతో కలిసి సింగపూర్ వెళ్లనున్నారు.