ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశాల్లో పర్యటించనున్నారు. గత నెలలో రష్యా, ఆస్ట్రియాలో పర్యటించిన మోదీ ఈసారి పోలాండ్, ఉక్రెయిన్కు వెళ్లనున్నారు. ఇందులో భాగంగా పోలాండ్ పర్యటనకు ఈరోజు బయల్దేరనున్నారు. మధ్య యూరప్ దేశాల్లో వ్యాపారంలో భారత్‌కు ప్రధాన భాగస్వామి పోలాండ్లో మోదీ ఇవాళ, రేపు పర్యటిస్తారు. దాదాపు 45 ఏళ్ల తర్వాత తొలిసారి పోలాండ్‌కు భారత ప్రధాని వెళ్లనున్నారు.
భారత్‌లో పోలాండ్‌కు చెందిన సుమారు 30 కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆ దేశంలో సుమారు 5 వేలమంది భారత విద్యార్థులు చదువుతున్నారు. పోలాండ్ పర్యటన తర్వాత అక్కడి నుంచి మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్తారు. ఈ నెల 23న ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని భేటీ కానున్నారు. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం పెరుగుతున్న తరుణంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య వివాదాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఉక్రెయిన్‌లో భారత ప్రధాని పర్యటించనున్నారు.