ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో జోరు సాగిస్తున్నారు. ఓవైపు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తూనే .. మరోవైపు తన సొంత నియోజకవర్గంలో ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తాజాగా ఆయన యూపీలోని అమ్రెహలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ ర్యాలీలో పాల్గొన్న ఆయన కూటమి నేతలు రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గతంలో ఈ ఇద్దరు యువరాజులు నటించిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని, అందుకే ప్రజలు వారిని తిరస్కరించారని ఎద్దేవా చేశారు.
“ఎన్నికలు జరిగే ప్రతిసారీ యూపీలో ప్రజలను వీరు బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయాల మాటున ఓట్లు అడిగేందుకు వస్తారు. ప్రచారంలో వీరు మన మతవిశ్వాసాలను దెబ్బతీసేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోరు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి భారత్ మాతాకీ జై అనేందుకు కూడా ఇబ్బంది పడతారు. అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్టకు ఆహ్వానం పంపితే కాంగ్రెస్, ఎస్పీ తిరస్కరించాయి. వీరు ప్రతిరోజూ రామాలయాన్ని, సనాతన ధర్మాన్ని నిందిస్తారు . రామభక్తులను ఎస్పీ బాహాటంగా కపటులని పిలిచింది” అని మోదీ ఆరోపించారు.