లక్షద్వీప్ పర్యటనతో స్వదేశీ విహారయాత్రకు తెరలేపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా మరో కీలక నినాదాన్ని లేవనెత్తారు. అదేంటంటే వెడ్ ఇన్ ఇండియా నినాదాన్ని మోదీ ఇచ్చారు. వివాహాలను ఘనంగా జరిపించేందుకు విదేశాలకు వెళ్లేవారంతా వాటిని భారత్‌లోనే చేసేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లోని అమ్రేలీ నగరంలో నిర్మించే ‘ఖోదల్‌ధామ్ ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రి’కి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటైన సమావేశాన్ని ఉద్దేశించి ఆదివారం ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు.
వివాహ వేడుకలు విదేశాల్లో చేసుకోవడం సబబేనా అని ఈ సందర్భంగా మోదీ ప్రశ్నించారు. ఈ రూపంలో ఎంతో సంపద బయటకు తరలిపోతోందని వీటిని మన దేశంలో చేసుకోలేమా? అని అన్నారు. విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు జరిపే వ్యాధి మీమీ సామాజికవర్గాల్లోకి రాకుండా చూడండి అని పిలుపునిచ్చారు. మేడిన్ ఇండియాలా వెడ్ ఇన్ ఇండియా, మ్యారీ ఇన్ ఇండియా అని పిలుపునిస్తున్నానని వీలైనంతవరకు ముందుగా మన దేశంలో పర్యటించండి అని ఈ సందర్భంగా మోదీ సూచించారు. ‘దేశీయంగా పర్యాటకాన్ని ప్రోత్సహించండి’ అని ఆయన పిలుపునిచ్చారు.