సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పలువురు నేతలు నోరు జారుతున్నారు. ఎన్నికల అధికారుల నోటీసులు అందుకుంటున్నారు. కొందరి కామెంట్స్ పై ఏకంగా పోలీసు కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పై పోలీసులు కేసు నమోదైంది. తన సోదరుడు సురేశ్ తరఫున ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఏం జరిగిందంటే
ఈ ఎన్నికల్లో డీకే సురేశ్ బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా.. తన సోదరుడి తరఫున ఈ ప్రాంతంలో శివకుమార్ ప్రచారంలో పాల్గొన్నారు. ఓ హౌసింగ్ సొసైటీలో ఆయన ఓటర్లను అభ్యర్థిస్తూ ‘‘నేను ఇక్కడికి ఓ బిజినెస్ డీల్ కోసం వచ్చా. నా సోదరుడు సురేశ్‌కు మీరు ఓటేసి గెలిపిస్తే.. మూడు నెలల్లో మీ ప్రధాన సమస్యను పరిష్కరిస్తాను. కావేరీ నదీ జలాలు సరఫరా చేసి మీకు అవసరమైన నీటిని కూడా కేటాయిస్తాం.’’ అని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ తీవ్రంగా ఫైర్ అయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా డీకే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారంటూ ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.