ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి విద్యార్థులకు అలర్ట్. పదో తరగతి ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 22వ తేదీన ఉదయం 11 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నారు. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ప్రకటిస్తారని డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ ఏడాది మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఏపీలో పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది దాదాపు 6.3 లక్షల మందికి పైగా విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాశారు. వీరంతా ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా జవాబు పత్రాల మూల్యాంకనం, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఫలితాల విడుదలకు ఈసీ నుంచి అనుమతి కూడా లభించడంతో ఇవాళ విద్యాశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయని తెలిపింది.