ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గత కొన్ని నెలలుగా ప్రజా క్షేత్రం లో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. జన్ సురాజ్ పేరిట ఆయన యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్నారు. గాంధీ జయంతి రోజున ‘జన్ సురాజ్’ పార్టీని స్థాపించనున్నట్లు పీకే తెలిపారు.
అలాగే వచ్చే ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. ప్రస్తుతం ‘జన్ సురాజ్’ పేరుతో క్యాంపెయిన్ నడుపుతున్న ప్రశాంత్ కిషోర్ అదే పేరును రాజకీయ పార్టీకి పెట్టనున్నట్లు వెల్లడించారు. కొత్త పార్టీకి ఎవరూ మార్గదర్శకం వహిస్తారనేది త్వరలో వెల్లడిస్తామని ఆదివారం పట్నాలో నిర్వహించిన జన్ సురాజ్ వర్క్షాప్లో చెప్పారు. మెరుగైన విద్యా, వైద్యం, బిహార్ భవిష్యత్తు కోసం శ్రమించాలని కార్యకర్తలకు ప్రశాంత్ కిషోర్ దిశానిర్దేశం చేశారు. రెండేళ్ల క్రితం బిహార్‌లో ‘జన్ సురాజ్’ యాత్రను ప్రశాంత్ కిశోర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.