యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కు కొత్త ఛైర్‌పర్సన్ వచ్చారు. 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి ప్రీతి సుదాన్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. ఆగస్టు 1న ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. సూదాన్ ఇంతకు ముందు UPSACలో సభ్యురాలిగా ఉండేవారు. ఆమె గతంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో సహా వివిధ పదవులను నిర్వహించారు.
ఈనెల 21వ తేదీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఛైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2029 మే 15 వరకూ పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన ఐదేళ్ల ముందుగానే వ్యక్తిగత కారణాలతో వైదొలిగారు. నెల రోజుల కిందటే రాష్ట్రపతికి ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. గుజరాత్‌లోని స్వామినారాయణ్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక కేంద్రానికి చెందిన అనూపం మిషన్‌లో నిష్కామ కర్మ యోగిగా చేరి.. ఆ కేంద్రానికి శేష జీవితాన్ని అంకితం చేయడానికి ఆయన పదవిని వదులుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే తాజాగా యూపీఎస్సీకి కొత్త ఛైర్పర్సన్ను నియమించారు.