ఉగ్రవాదికి క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి

-

దిల్లీలో కాల్పులకు పాల్పడిన ఓ ఉగ్రవాది తన ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు. దేశ భద్రత, ప్రజల ఐకమత్యం, సార్వభౌమాధికారానికి భంగం కలిగించే చర్య కావడంతో ముర్ము సదరు ఉగ్రవాది క్షమాభిక్షకు అంగీకరించలేదని రాష్ట్రపతి భవన్‌ వర్గాలు తెలిపాయి. ఏం జరిగిందంటే?

డిసెంబరు 22, 2000లో దిల్లీలోని ఎర్రకోట వద్ద పహారా కాస్తున్న సిబ్బందిపై పాకిస్థాన్‌ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడిన నలుగురు వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఇందులో ముగ్గురు ఆర్మీ సిబ్బంది అమరులవ్వగా.. ఘటన జరిగిన రెండ్రోజుల అనంతరం నిందితుల్లో ఒకరైన మహమ్మద్‌ ఆరిఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మిగతా ముగ్గురు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మృతి చెందారు. పలు విచారణల అనంతరం నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్‌-ఎ-తోయిబాకు చెందిన ఆరిఫ్‌కు ఉరిశిక్ష విధిస్తూ 2005 అక్టోబరులో ట్రయల్‌ కోర్టు తీర్పు వెలువరించింది. అనంతరం పలుమార్లు పలు అప్పీళ్లు, రివ్యూ పిటిషన్లు దాఖలు చేసినా ఫలితం లేకపోవడంతో చివరి యత్నంగా క్షమాభిక్ష కోరుతూ మే 15న రాష్ట్రపతికి దరఖాస్తు చేయగా.. మే 27న ఆమె తిరస్కరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version