భారత గణతంత్ర్య దినోత్సవం వేళ దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ పురస్కారాలను అందజేశారు.
ఈ ఏడాది మొత్తం 132 ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించగా.. వీటిలో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. సోమవారం సాయంత్రం దాదాపు సగం మందికి పురస్కారాలు అందించారు. మిగతావారికి వచ్చే వారం ఇచ్చే అవకాశం ఉంది.
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ (మరణానంతరం) తరఫున ఆయన కుటుంబసభ్యులకు పద్మవిభూషణ్ అవార్డును అందజేశారు. సినీనటుడు మిథున్ చక్రవర్తి, మాజీ గవర్నర్ రామ్‌నాయక్, ప్రముఖ గాయని ఉషా ఉథుప్ పద్మభూషణ్ పురస్కారం స్వీకరించారు. తెలంగాణలోని నారాయణపేటకు చెందిన బుర్ర వీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్ప రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.