తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది. విద్యాశాఖ అధికారులు ఈ తేదీని ప్రకటించారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి నెల 18వ తేదీ నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు జరిగాయి. 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.
దానికి సంబంధించిన మూల్యాంకనం పూర్తి కావడంతో వారం రోజులపాటు ఫలితాల డీ కోడింగ్ చేస్తారు. అనంతరం ఈనెల 30వ తేదీన ఉదయం ఫలితాలను వెల్లడించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా మంత్రులు కాకుండా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేయనున్నారు.
మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటర్ విద్యామండలి కార్యాలయంలో బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శ్రుతి ఓజా సోమవారం తెలిపారు. మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫలితాలను విద్యార్థులు https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్‌సైట్ల నుంచి పొందవచ్చు.