లోక్సభ సమావేశాల్లో నాలుగో రోజైన నేడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ఇటీవల నీట్, నెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో వెలుగుచూసిన అక్రమాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టే నియామకాలు, పరీక్షల్లో పవిత్రత ఉండాలని.. పారదర్శకంగా జరగాలని పేర్కొన్నారు. పేపర్ లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నతస్థాయిలో విచారణ జరుగుతోందని తెలిపారు. ఇలాంటి ఘటనల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. నీట్, తదితర పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని హామీ ఇచ్చిన రాష్ట్రపతి.. పేపర్ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
“డిజిటల్ ఇండియా సాధనకు ప్రభుత్వం సంకల్పించింది. బ్యాంకుల క్రెడిట్ బేస్ పెంచి వాటిని బలోపేతం చేశాం. డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. సైనిక దళాల్లో స్థిరమైన సంస్కరణలు రావాలి. మన బలగాలు స్వయంసమృద్ధి సాధించాయి. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేశాం. సైనికులకు ఒకే ర్యాంకు ఒకే పింఛను అమలు చేశాం. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయి. సీఏఏ కింద శరణార్థులకు ప్రభుత్వం పౌరసత్వం కల్పించింది. జులై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి రానున్నాయి.” అని రాష్ట్రపతి తెలిపారు.