గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్ బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఖాళీ అయిన అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉపఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో వయనాడ్ ఎంపీ స్థానం నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగారు.
ఈ క్రమంలోనే కేరళలో రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలో నడుస్తున్న యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రియాంక గాంధీకి మద్దతు ప్రకటించడంతో పాటు ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమైంది. వయనాడ్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యూడీఎఫ్ సమావేశాలను నిర్వహించనుంది. ఇందులో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడు కే. సుధాకరన్, కాంగ్రెస్ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, యూడీఎఫ్ కన్వీనర్ ఎంఎం హసన్, ఐయుఎంఎల్ ప్రధాన కార్యదర్శి పికె కున్హాలి కుట్టి సహా ప్రముఖులు పాల్గొంటారని సమాచారం.