దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వీధి శునకాల దాడులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కుక్కల దాడుల్లో పలు చోట్ల చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే. మరికొన్ని చోట్ల తీవ్ర గాయాల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో కుక్కల దాడులకు సంబంధించిన ఓ కేసులు పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
వీధి శునకాలు, ఇతర జంతువుల దాడి కేసులో పరిహారం చెల్లించాల్సిన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పంజాబ్- హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ విభాగం లేదా ప్రైవేటు వ్యక్తుల నుంచి రికవరీ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది అని హైకోర్టు ధర్మాసనం తీర్పులో పేర్కొంది. కుక్క కాటుకు గురైన వ్యక్తికి ఒక్కో పంటి గాటుకు కనీసం రూ.10వేలు చెల్లించాలని, గాయం తీవ్రమైనదైత.. (0.2 సెం.మీ మేర కోతపడినట్లయితే) రూ.20వేల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వీధుల్లో ఉండే మూగజీవాల దాడులకు సంబంధించి దాఖలైన 193 పిటిషన్లను పంజాబ్-హరియాణా హైకోర్టు విచారించి ఆసక్తికర తీర్పు వెలువరించింది.