46 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత.. విశ్వప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రం రత్న భాండాగారం తలుపులను .. ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు తెరిచారు. జగన్నాథుని వెలకట్టలేని సంపద ఉన్న మూడో రహస్య గది తలుపులు.. అక్కడున్న మూడు తాళం చెవులతోనూ తెరుచుకోలేదు. దీంతో మేజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన శ్రీక్షేత్ర పాలనాధికారి అరవింద పాఢి, పూరీ కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వయిన్, మరో 8 మంది ఇతర ప్రతినిధులు భాండాగారం లోనికి వెళ్లారు.
ఉదయం 11 మంది ప్రతినిధులు ముందుగా జగన్నాథ దర్శనం చేసుకుని.. విమలాదేవి, మహాలక్ష్మి ఆలయాల్లో పూజలు చేశాక.. మధ్యాహ్నం 1.28 గంటలకు శుభముహూర్తంలో భాండాగారంలోని తొలి రెండు గదులు తెరిపించారు. పురుషోత్తముని నిత్యసేవలు, పండగలు, యాత్రలకు వినియోగించే ఆభరణాలను స్వామి గర్భగుడికి సమీపంలో ఉన్న చంగడా గోపురంలో భద్రపరిచారు. లోపల ఇత్తడి పూత ఉన్న ఆరు కొత్త చెక్కపెట్టెల్లో మొదటి రెండు గదుల్లోని ఆభరణాలను బయటకు తీసుకొచ్చారు.