ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బాధితులకు సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తొక్కిసలాటలో గాయపడిన వారిని కలిసి ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ వెంట ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ సహా పలువురు ముఖ్య నేతలు ఉన్నారు.
మంగళవారం ఉత్తర్ ప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లా ఫుల్‌రయీలో సత్సంగ్ సందర్భంగా జరిగన తొక్కిసలాటలో 121 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. మరోవైపు ఈ ఘటన తర్వాత పరారీలో ఉన్న భోలే బాబాను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆదేశాల మేరకు హాథ్రస్ ఘటనపై దర్యాప్తునకు బుధవారం ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయకమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.