భారత్లో హైదరాబాద్ సహా పది నగరాల్లో రోజువారీ మరణాల్లో సగటున 7 శాతానికి పైగా వాయు కాలుష్యం వల్లే సంభవిస్తున్నాయని ది లాన్సెట్ నివేదిక వెల్లడించింది. దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై లాన్సెట్ ఆందోళన వ్యక్తం చేసింది. 2008 నుంచి 2019 మధ్య పదకొండేళ్ల కాలంలో సంభవించిన దాదాపు 36 లక్షల మరణాలను విశ్లేషించిన ఈ బృందం పది నగరాల్లో పీఎం 2.5 కాలుష్య రేణువుల స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణిక పరిమితులను మించాయని గుర్తించింది.
రోజువారి మరణాలు, వాయు కాలుష్యం మధ్య ఉన్న సంబంధం ఏమిటనే విషయమై అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబయి, పుణె, శిమ్లా, వారణాసిలలో అంతర్జాతీయ నిపుణులతో పాటు భారత శాస్త్రవేత్తలు అధ్యయనం సాగించారు. సంవత్సరంలో 99.8 శాతం రోజులు వాయు కాలుష్యం పరిమితులు దాటి ఉంటోందని ఈ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌లో వాయు కాలుష్యం వల్ల 5.6 శాతం మరణాలు (1,597) సంభవించాయని ఈ నివేదిక పేర్కొంది.