కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వేసిన అనర్హతను ఎత్తివేసినట్లు లోక్‌సభ సచివాలయం ఇవాళ ప్రకటించింది. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో… ఆయనకు కింది కోర్టు దోషిగా తేల్చడంపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో..రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. అనర్హత వేటు ఎత్తేసినట్లు తెలియగానే రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. పార్లమెంట్‌కు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేతకు ప్రతిపక్ష ఇండియా ఫ్రంట్ నేతలు ఘన స్వాగతం పలికారు. లోక్‌సభ భవనం ముందు నిలబడి సంబురాలు చేసుకున్నారు.
మరోవైపు రాహుల్‌పై అనర్హత ఎత్తివేతతో.. దిల్లీలోని 10 జన్‌పథ్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్ష ఇండియా ఫ్రంట్ నేతలు మిఠాయిలు తినిపించుకున్నారు. ఖర్గే స్వయంగా నేతలందరికీ స్వీట్లు తినిపించారు. రాహుల్‌పై అనర్హతను ఎత్తివేస్తూ సభాపతి తీసుకున్న నిర్ణయాన్ని.. మల్లికార్జున ఖర్గే స్వాగతించారు. దేశ ప్రజలకు, ముఖ్యంగా వయనాడ్ ప్రజలకు ఇదో గొప్ప ఊరటని అన్నారు. ఇక ప్రధాని మోదీ సర్కారుపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 8వ తేదీ (మంగళవారం) నుంచి లోక్‌సభలో చర్చ జరగనుంది. ఈ చర్చలోనూ రాహుల్ పాల్గొననున్నారు.