సార్వత్రిక ఫలితాల్లో ఇండియా కూటమి దూసుకెళ్తోంది. ఈ కూటమి చాలా ప్రాంతాల్లో తన ప్రభావం చూపుతోంది. అంచనా వేసిన దానికంటే ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుతోంది. మరోవైపు ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ తగ్గేదే లే అంటూ ఈ ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్లారు. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ రాహుల్‌గాంధీ విజయం సాధించారు. ఉత్తర్‌ప్రదేశ్ రాయ్‌బరేలీ, కేరళ వయనాడ్ నుంచి ఆయన విజయదుందుభి మోగించారు. మొత్తానికి రాహుల్ డబుల్ ధమాకా సాధించారు.
కేరళలోని వయనాడ్‌లో వరుసగా రెండోసారి గెలుపొందారు. తన సమీప సీపీఐ అభ్యర్థి యానీ రాజాపై 3.5లక్షలపైగా మెజార్టీ సాధించారు. అటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని తమ కంచుకోట రాయ్‌బరేలీలో 3.7లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు. రెండు స్థానాల్లో విజయం సాధించిన రాహుల్ ఏ స్థానానికి రాజీనామా చేస్తారనే ప్రశ్న ఇప్పుడు అందరిలో నెలకొంది. మరి రాహుల్ గాంధీ ఏ స్థానాన్ని వదులుకుంటారో చూడాలి.