రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. 199 స్థానాలకు ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 వరకు జరగనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో 5.26 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 51 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. లక్షా 70 వేల మంది భద్రతా సిబ్బం.. సుమారు 2.74 లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నట్లు వివరించారు.
రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలు ఉండగా.. శనివారం 199 సీట్లకే ఎన్నికలు జరుగుతున్నాయి. కరణ్‌పుర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్‌సింగ్ మృతి చెందిన నేపథ్యంలో ఆ స్థానానికి ఎన్నిక వాయిదా పడింది. రాజస్థాన్‌లో మొత్తం ఓటర్లు- 5.25 కోట్లు ఉండగా.. అందులో మహిళలు- 2.52 కోట్లు, పురుషులు- 2.73 కోట్లు ఉన్నారు. ఇక ఈ రాష్ట్రంలో 80 ఏళ్లు పైబడిన వారు 51,033 ఉన్నారు. మరోవైపు దివ్యాంగులు- 11,894 ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి.