తెలంగాణ శాసనసభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం.. ఈసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కార్యాచరణ రచించింది. అందులో భాగంగా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. మొన్నటిదాకా రాష్ట్ర నేతలతో ప్రచారం నిర్వహించిన హస్తం పార్టీ.. ఇప్పుడు జాతీయ నేతలను రంగంలోకి దింపుతోంది. ఒక్కొక్కరుగా ఏఐసీసీ నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇక పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ ఒకేసారి జాతీయ నేతలు రాష్ట్రానికి మూకుమ్మడిగా వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఇవాళ్టి నుంచి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు.
ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రానికి రానున్న రాహుల్ గాంధీ.. ఒంటి గంటకు ఆందోల్, 2.30 గంటలకు సంగారెడ్డి, సాయంత్రం 4.15 గంటలకు కామారెడ్డిలో ప్రచారం చేయనున్నారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. మరోవైపు హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఎల్బీనగర్ నియోజక వర్గం కార్నర్ సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్ది మధుయాస్కీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఆయన ఇవాళ కూడా ప్రచారంలో పాల్గొని తిరిగి దిల్లీకి పయనం కానున్నారు.