రాజస్థాన్‌లోని దౌసాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వంతెనపై వెళ్తున్న బస్సు అదుపుతప్పి కింద ఉన్న రైల్వే ట్రాక్‌పై పడింది. జైపుర్-దౌసా 21వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. హరిద్వార్ నుంచి ఉదయ్‌పుర్ వైపు వెళ్తున్న బస్సు ఇవాళ ఉదయం 2 గంటల 15 నిమిషాల సమయంలో దౌసాలోని రైల్వే ఓవర్‌బ్రిడ్జ్‌పై అదుపు తప్పినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వంతెన గోడను ఢీ కొట్టి 50 అడుగుల ఎత్తు నుంచి రైలు పట్టాలపై పడిందని వెల్లడించారు. ముందు జాగ్రత్తగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేసి.. బస్సులో చిక్కుకున్న ప్రయాణికుల్ని రక్షించినట్లు చెప్పారు. మరోవైపు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.