దేశ రాజధాని దిల్లీలోని తీహార్ జైల్లో ఇవాళ తెల్లవారుజామున దారుణం జరిగింది. ఇవాళ ఉదయం జైలులో ఖైదీల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఓ ఖైదీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు ప్రకటన జారీ చేశారు. ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో దిల్లీలోని రోహిణి కోర్టు కాల్పుల ఘటన నిందితుడు టిల్లు తాజ్పురియా హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. అతడి ప్రత్యర్థి యోగేశ్ అనే ఖైదీ తాజ్పురియాను చంపినట్లు వెల్లడించారు.
అయితే ఘర్షణ జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లే వరకు తాజ్పురియా తీవ్రంగా గాయపడి ఉన్నట్లు తెలిసింది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. గ్యాంగ్స్టర్ యోగేశ్తో పాటు అతని అనుచరులు తాజ్పురియాపై ఇనుప రాడ్తో దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.