ఇంటి పైకప్పు కూలి ఐదుగురు దుర్మరణం చెందిన ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని లక్నోలో చోటుచేసుకుంది. ఆలంబాగ్లోని పాత రైల్వే కాలనీలో ఇంటిపైకప్పు కూలడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతులను సతీశ్ చంద్ర, అతడి భార్య సరోజినీ దేవి, పిల్లలు హర్షిత, హర్షిత్, అన్ష్‌లగా గుర్తించారు.
విషయం తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని.. శిథిలాల కింద సతీశ్ కుటుంబసభ్యులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు తూర్పు డీసీపీ హృదేశ్ కుమార్ తెలిపారు. కానీ అప్పటికే వారంతా చనిపోయినట్లుగా వైద్యులు ధ్రువీకరించారని చెప్పారు. ఈ ఘటనపై ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించడంపై యూపీ డిప్యూటీ సీఎం బ్రిజేశ్ పాఠక్ కూడా స్పందించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మృతులు నివసించిన ఇల్లు చాలా పాతదని ఇటీవల వర్షాలు కురవడం వల్ల అది ఇంకా శిథిలావస్థకు చేరుకుందని అన్నారు. ఈ క్రమంలోనే కూలిపోయి ఉంటుందని బ్రిజేశ్ పాఠక్ భావిస్తున్నారు.