జైపుర్ ఎక్స్‌ప్రెస్ రైలులో దారుణం జరిగింది. రాజస్థాన్‌లోని జైపుర్ నుంచి ముంబయి వెళ్తున్న రైలులో కాల్పులు కలకలం రేపాయి. రైలు మహరాష్ట్రలోని పాల్ఘర్ స్టేషన్ దాటి వెళ్లున్న సమయంలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ కుమార్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఆర్పీఎఫ్ ఏఎస్సైతో పాటు ముగ్గురు ప్రయాణికులు చనిపోయారు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల అనంతరం దహిసర్ స్టేషన్ వద్ద నిందితుడు రైలు నుంచి దూకేశాడు. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
చేతన్ కుమార్ అనే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తన సీనియర్, ఆర్పీఎఫ్ ఏఎస్ఐ టికా రామ్ మీనాను కదులుతున్న రైలులో కాల్చి చంపాడు. అనంతరం మరో బోగీలోకి వెళ్లి ముగ్గురు ప్రయాణికులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు. గవర్నమెంట్ రైల్వే పోలీస్, ఆర్పీఎఫ్ అధికారుల సహాయంతో నిందితుడిని మిరా రోడ్డు వద్ద పట్టుకుని అరెస్టు చేశారు. అయితే చేతన్ కాల్పులకు ఎందుకు తెగబడ్డాడనే విషయంపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.