ప్రతి ఏటా డిసెంబర్లో శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తడం ఆనవాయితీ. అయితే ఈసారి మాత్రం గత ఏడాది కంటే అత్యధికంగా భక్తులు తరలివస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో గంటల కొద్దీ వరుసల్లో వేచి ఉంటున్నారు. కొన్నిసార్లు గంటల పాటు వేచి ఉన్నా దర్శనం కావట్లేదు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు అయ్యప్ప స్వామి దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నట్లు సమాచారం.
కర్ణాటకకు చెందిన భక్తులు పందళంలోని శ్రీధర్మశాస్త ఆలయంలో ఇరుముడి సమర్పించి, అయ్యప్పకు నెయ్యాభిషేకం చేసి స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు. శబరిమలకు వెళ్లే రహదారుల్లో మంగళవారం కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ఐదు రోజులుగా రోడ్లపై వాహనాలు బారులు తీరుతున్నాయి. తాము శబరిమల చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భక్తులు పలుచోట్ల నిరసనలు తెలుపుతున్నారు. పంబ చేరుకుని తిరిగి వెళ్లాలంటే చాలా కష్టంగా ఉందని వాపోతున్నారు.
రోజుకు లక్ష మందికిపైగా భక్తులు శబరిమలకు రావడం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడిందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ వెల్లడించారు. ఇలాంటి సందర్భాల్లో సమస్యలు తలెత్తడం సాధారణమేనని అన్నారు. శబరిమలలో సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.