రెండు దశాబ్దాలుగా విరోధులుగా ఉన్న నవనిర్మాణ్ సేన, శివసేన (UBT)ల అధ్యక్షులు రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు త్వరలో కలిసి పోనున్నారనే వార్తలు ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే దీనిపై తాజాగా ఉద్ధవ్ సేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. అయితే ఈ ఇద్దరి మధ్య రాజకీయ పొత్తుకు సంబంధించి ఎటువంటి సంప్రదింపులు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం వీరి మధ్య భావోద్వేగ చర్చలు మాత్రమే జరుగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో రాజకీయంగా ఏకమవుతారా అన్న ప్రశ్నకు దీనిపై.. సోదరులిద్దరూ నిర్ణయం తీసుకుంటారు అని చెప్పారు.
మహారాష్ట్ర ప్రజలు, మరాఠీ భాష ప్రయోజనాల కోసం ఉద్ధవ్‌తో కలిసి పని చేసేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని ఇటీవల రాజ్ ఠాక్రే పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందుకు ఉద్ధవ్ కూడా సానుకూలంగా స్పందించారు. దీంతో ఈ ఇద్దరు సోదరులు కలిసిపోతారనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం చర్చనీయాంశమవుతోంది. గత లోక్‌సభ ఎన్నికల ముందు ఎన్డీయేకు మద్దతిచ్చిన రాజ్‌ఠాక్రే.. విపక్ష శివసేన(యూబీటీ)తో కలిసి పనిచేస్తే మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.