సూర్యాపేట జిల్లాలో తెలంగాణ ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అంబులెన్సులను తీసుకుని ఘటనాస్థలికి చేరుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సూర్యాపేట జిల్లా చింతలపాలెం వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. రోడ్డుపై అడ్డొచ్చిన బైక్‌ను తప్పించేందుకు ప్రయత్నిస్తుండగా బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. దీంతో డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. అయితే తాము వచ్చే వరకే స్థానికులు కొందరిని కాపాడి ఆస్పత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు. ఆర్టీసీ బస్సు కోదాడ నుంచి చింతలపాలెం వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంటున్నట్లు వివరించారు.