శుభవార్త.. ఇకపై శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలు.. మారుమూల ప్రాంతాల్లోనూ వేగంగా ఇంటర్నెట్..!

-

దేశంలో 4జి స్థానంలో ఓ వైపు 5జి వస్తోంది. అయినప్పటికీ ఇంకా అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో లేవు. దీని వల్ల ప్రజలకు సౌకర్యాలు సరిగ్గా అందడం లేదు. అలాగే అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మెరుగైన సేవలను అందించేందుకు వీలు లేకుండా పోతోంది. కానీ ఇకపై ఈ విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్రం త్వరలో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలకు అనుమతులు ఇవ్వనుంది. దీంతో మారుమూల ప్రాంత వాసులకు కూడా మెరుగైన కమ్యూనికేషన్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలకు అనుమతులు ఇస్తే.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్దిష్టమైన రుసుం చెల్లించి ఆ సేవలను వినియోగదారులకు అందించేందుకు లైసెన్స్‌లు పొందవచ్చు. ప్రస్తుతం ఈ సేవలను దేశంలో కేవలం కొన్ని ఎంపిక చేసిన రంగాల్లో మాత్రమే అది కూడా పరిమితంగానే ఉపయోగిస్తున్నారు. అయితే శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలకు అనుమతులు ఇస్తే కంపెనీలు మారుమూల ప్రాంతాల్లో ఉండే పౌరులకు మెరుగైన కమ్యూనికేషన్‌ సేవలను అందించేందుకు వెసులుబాటు ఏర్పడుతుంది. ప్రస్తుతం అనేక గ్రామాల్లో ఇప్పటికీ ఇంటర్నెట్‌ అందుబాటులో లేదు. వారందరికీ మెరుగైన వాయిస్‌ కాల్స్ సేవలు, ఇంటర్నెట్‌ స్పీడ్‌ లభిస్తాయి.

శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలకు అనుమతులు ఇస్తే ప్రభుత్వ రంగాలకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా రైల్వేలు దేశంలోని అన్ని రైళ్లు, రైల్వే స్టేషన్లను మరింత మెరుగ్గా నిర్వహించవచ్చు. రక్షణ, భద్రత పెరుగుతాయి. అయితే ఈ సేవలకు అనుమతులు ఇచ్చేందుకు అవసరమైన డ్రాఫ్ట్‌ బిల్లును ట్రాయ్‌ రూపొందిస్తోంది. దానికి కేంద్రం అనుమతి లభిస్తే వెంటనే దేశంలో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలు ప్రారంభం అవుతాయి. నిజానికి ఈ సేవలు విదేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అందువల్ల అక్కడ ప్రజల జీవన స్థితిగతులు మరింత మెరుగ్గా ఉన్నాయి. అందువల్లే ఈ సేవలను కేంద్రం మన దేశంలోనూ అందించేందుకు ప్రయత్నిస్తోంది. మరి ఈ సేవలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version