పశ్చిమ బెంగాల్కు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘనవిజయం సాధించాలని, మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కోరుకుంటున్నారు. జగన్‌రెడ్డేకాదు.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్దవ్‌ఠాక్రే, ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్,… ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో మమతా బెనర్జీ గెలవాలని కోరుకునేవారు కోకొల్లలు.
అణచివేతను అడ్డుకోవాలి
పశ్చిమ బెంగాల్ ఎన్నికల వైపు దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఎదురుచూస్తున్నాయి. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను అణచివేసుకుంటూ వస్తున్నారనేది బహిరంగ రహస్యం. వారు శత్రువులైనా సరే.. మిత్రులైనా సరే. ప్రాంతీయపార్టీలు ఉండకూడదు అనేది ప్రధాని మోడీ, ఆయన ఆప్తమిత్రుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల వ్యక్తిగత సిద్ధాంతం. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట జాతీయపార్టీలకు మనుగడ ఉండదన్న ఉద్దేశంతో వారిద్దరూ ముందుకు వెళుతున్నారు. మోడీ బాధ పడలేని కొన్ని ప్రాంతీయ పార్టీలు మమత ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆమె వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వైసీపీ కేంద్ర రాజకీయం
తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు పశ్చిమబెంగాల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. తెలంగాణలో ఇప్పుడిప్పుడే బీజేపీ బలపడుతోంది. అయితే కేసీఆర్ బీజేపీ అధిష్టానానికి ఎదురుతిరగలేక కొన్ని విషయాల్లో కమలానికి మద్దతునిస్తున్నారు. ఒకవేళ మమత గెలిస్తే ఆయన మమత వెంట వెళ్లే అవకాశం ఉంది. గతంలో థర్డ్ ఫ్రంట్ అని కేసీఆర్ మమత, స్టాలిన్ ను కలిశారు. వైసీపీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా రాజకీయం చేస్తోంది. రాష్ట్రంలో మాత్రం వ్యతిరేకంగా ఉంటున్నారు. అటు టీడీపీ ఇప్పటికే కేంద్రంతో తెగదెంపులు చేసుకుంది. జనసేన సైతం దూరం జరిగే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో మోడీకి ప్రత్యామ్నాయంగా మమత గెలిస్తే మాత్రం ఆమె వెంట నడవడానికి దేశంలోని ప్రాంతీయపార్టీల నేతలు సిద్ధంగా ఉన్నారు.