ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకాల కోసం కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఈసీ, ఈసీల నియామకాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ పిటిషన్ల అత్యవసర విచారణ చేపట్టాలని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) తాజాగా అభ్యర్థించింది. ఇందుకు అంగీకరించిన సుప్రీం కోర్టు.. మార్చి 15వ తేదీన (శుక్రవారం) విచారణ జరుపుతామని తెలిపింది.
కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీ అయిన కమిషనర్ల పోస్టులను ఈ నెల 15వ తేదీలోగా భర్తీ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత నెల ఒక కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా.. ఇటీవల మరో కమిషనర్ అరుణ్ గోయెల్ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగలడంతో ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది.